Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో శుక్రవారం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ రవీంద్ర రాజ్యాంగ పీఠిక ను చదివి విద్యార్థులు ఉపాధ్యాయుల చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలు జరిగి 72 సంవత్సరాలు గడుస్తున్నా అంబేద్కర్ ఆశించిన ఫలితాలు దేశంలో రాలేదని అన్నారు. భారతదేశంలో పేదరిక నిర్మూలన జరిగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించాడని దాన్ని అమలు చేసే పాలకులు అగ్రవర్ణాలవారు, పెట్టుబడిదారులు కావడం వల్ల దేశం అభివృద్ధి చెందక వెనుకబడే ఉందని అన్నారు. ప్రజలంతా చైతన్యవంతులై అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోని అంశాలు అన్నీ నిష్పక్షపాతంగా అమలు జరిగితే దేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తూ పేదరిక నిర్మూలన జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు.