దేశంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపటి నుండి 72 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా కాలంలో సమ్మెలకు పిలుపునివ్వటం సరి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. సింగరేణిలో లేఅఫ్ ప్రకటించినప్పుడు 50 రోజులపాటు కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కార్మికులు సమ్మెలో పాల్గొంటే రోజుకు 20 కోట్లు (సింగరేణి కార్మికులు అందరు) నష్టపోనున్నారు. కాసిపేట 1వ గనిపై ఏఐటీయూసీ నాయకులు ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ 72 గంటల సమ్మెను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. మరోవైపు కాసిపేట 2వ గనిపై టిబిజికెఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలో సమ్మె అవసరమా అంటూ సింగరేణి యాజమాన్యం కార్మిక వార్డులలో ప్రచారం చేస్తుంది. మరి కార్మికులు 72 గంటల సమ్మెకు మొగ్గు చూపుతారో, లేదా 24 గంటల పాటు సమ్మె పాటిస్తారో, లేదా విధులకు హాజరవుతారో చూడాలి.