మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల ప్రాంతాలలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కాసిపేట మండలం నుండి ఈ ప్రాంతాలకు ప్రజలు రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రజలు ప్రయాణ చేసే సమయంలో జాగ్రత్తగా లేకపోతే కాసిపేట మండలంలో కూడా కరోనా కలకలం సృష్టించవచ్చు. ప్రయాణం సమయంలో మాస్కు వాడకంతో పాటు శ్యానిటైజర్ వెంట తీసుకెళ్లడం మంచిది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటువేసే ప్రమాదం ఉంది. వర్షాకాలం కూడా కావడంతో వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తో ముప్పే
లాక్ డౌన్ సడలింపుల తరువాత మండలంలో ప్రజా రవాణా పునర్ ప్రారంభం అయింది. కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, సొంత వాహనాలతోపాటు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ (బస్సులు, ఆటోలు) ద్వారా ప్రయాణిస్తున్నారు. రోజు వందలసంఖ్యలో బస్సులు, ఆటోలలో ప్రజలు ప్రయాణం సాగిస్తుండడంతో సోషల్ డిస్టెన్స్ పాటించడం వీలుకావడం లేదు. బస్సులలో సీట్ల పరిధికి మించి (నిలబడి) ప్రయాణిస్తున్నారు. ప్రయాణం సమయంలో టికెట్ తీసుకొని, డబ్బులు ఇచ్చిన తరువాత శ్యానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి. అలా చేయకుండా అదే చేతితో మాస్కును, శరీరభాగాలను, మొబైల్ ని టచ్ చేస్తే ప్రమాదంలో పడ్డట్టే. చిన్న పొరపాటుకు భారీ మూల్యం తప్పకపోవచ్చు.
మళ్ళీ ఆంక్షలు
పక్క ప్రాంతాలలో కరోనా కేసులు నమోదవుతుండడంతో వ్యాపార సంఘాలు, దుకాణదారులు స్వీయ ఆంక్షలు అవలంబిస్తున్నారు. సోమగూడెంలో సెలూన్ షాపులను జులై 7వ తేది వరకు మూసివేయాలని నాయీ బ్రాహ్మణ సేవ సంఘం వారు నిర్ణయించారు. ముత్యంపల్లి గ్రామంలో దుకాణాలను సాయంత్రం 6గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని గ్రామ సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ తిరుపతి గారు సూచించారు. ఇతర గ్రామాలలో కూడా కొందరు వ్యాపారాలు, దుకాణదారులు సాయంత్రం వరకు మాత్రమే తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.