Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరోనా కాలంలో కూడా ఆగని అక్రమ దందా

  • కరోనా కట్టడిలో ప్రభుత్వ యంత్రాంగం !
  • ఇదే అదనుగా దొంగ పత్తి విత్తనాల సరఫరా? 

Kasipet Mandal News:-
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిలో ప్రభుత్వ యంత్రాంగం అంతా తలమునకలైంది, దీన్ని ఆసరాగా చేసుకొని పర్యావరణానికి హాని కలిగించే ప్రభుత్వ అనుమతులు లేని  గడ్డి పత్తి  విత్తనాల దందా మంచిర్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది. దొంగ పత్తి విత్తనాలు సరఫరా చేసే ముఠాలు పెద్ద ఎత్తున జిల్లాలోని కాసిపేట, తాండూరు, భీమిని, బెల్లంపల్లి, కన్నెపల్లి మండలాలలోని గ్రామాల రైతులకు విత్తనాలను రహస్యంగా సరఫరా చేస్తున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా పోలీసులకు తాండూరు, భీమిని, కన్నెపెళ్లి, బెల్లంపల్లి  మండలాల్లో పట్టుబడ్డ  వారే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. 


వ్యాధులు సోకే ప్రమాదం :-
భారత ప్రభుత్వము అనుమతులు లేకుండా గత ఐదేళ్లుగా దొంగచాటుగా విదేశీ విత్తన కంపెనీ గ్లైసిల్‌ పత్తి విత్తనాల సాగు దేశంలోని వివిధ రాష్ట్రాలలో సాగుతోంది. గడ్డి పత్తి సాగు వల్ల పర్యావరణానికి తీవ్ర హాని తో పాటు మనుషులకు కూడా చర్మ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులకు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం సాగుకు అనుమతి ఇవ్వడం లేదు. అయినా విదేశీ విత్తన సంస్థ దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలలో గత ఐదేళ్లుగా విత్తన సాగు దొంగచాటుగా సాగిస్తుంది. అవే విత్తనాలను కొన్ని ముఠాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో గత ఐదేళ్లుగా రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గడ్డి పత్తి సాగుతో, కలుపు సమస్య, కూలీల అవసరం లేకపోవడంతో  సులువుగా సాగుచేసి అధిక లాభాలు పొందుతూ వుండడంతో గడ్డి పత్తి సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. అనుమతి లేని పత్తి విత్తనాల సాగు వల్ల ప్రభుత్వ అనుమతి ఉన్న విత్తనాలు రైతులు కొనుగోలు చేయకపోవడంతో పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. 


నకిలీ పత్తి విత్తనాలతో పట్టుపడ్డ మండల వాసి:-
ప్రతి ఏడాది వర్ష కాలం ముందు వ్యవసాయ శాఖ, పోలీసులు అనుమతి లేని పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని ప్రచారం చేసినా రైతులు పట్టించుకోవడం లేదు. కాసిపేట మండలంలో పత్తి పంట సాగులో సగానికిపైగా గడ్డి పత్తి విత్తనాలు సాగుతున్నాయని ఒక అంచనా. గత సంవత్సరం మండలంలోని మల్కపల్లి, వరిపేట, ముత్యంపల్లి, కాసిపేట గ్రామాలలో వ్యవసాయ శాఖ, పోలీసులు దొంగ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినా గడ్డి పత్తి సాగు ఆగడం లేదు. ఈ సంవత్సరం కూడా గత ఏప్రిల్ నుండి పత్తి విత్తన ముఠాలు గ్రామాలకు గుట్టుచప్పుడు కాకుండా విత్తనాలు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే వరిపేట, కాసిపేట, ముత్యంపల్లి, సోనాపూర్, వెంకటాపూర్ గిరిజన గ్రామాలలో కూడా గడ్డి పత్తి విత్తనాలను ముఠాలు చేరవేశాయని ప్రచారం జరుగుతుంది. ఇటీవల బెల్లంపల్లి మండలంలో కాసిపేట మండలం బుగ్గగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని గడ్డి పత్తి విత్తనాలతో పోలీసులు పట్టుకోవడం బలాన్ని చేకూరుస్తుంది. పర్యావరణానికి హాని కలిగించే గడ్డి పత్తి సాగు వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది. దీనిపై మండల వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టి సాగును అరికట్టి పర్యావరణాన్ని కాపాడాలని మండల పర్యావరణ ప్రేమికులు, ప్రజలు కోరుతున్నారు.
అకేనపల్లిలో నకిలీ పత్తి విత్తనాలతో పట్టుపడ్డ మండల వాసి 
కాసిపేట మండలంలోని మీ బంధు మిత్రులకు Kasipet Mandal App Share చేయండి. మన కాసిపేట మండలం డిజిటల్ రంగంలో అభివృద్ధికై మాతో సహకరించండి.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App